Maha kumbhamela: శివ నామస్మరణతో మహాకుంభమేళా ముగింపు 1 y ago

featured-image

ఎక్క‌డ చూసినా.. అఘోరాలు

ఎక్క‌డ చూసినా.. సన్యాసులు

ఎక్క‌డ చూసినా.. పుర్రెలు ధ‌రించి డ్యాన్సులు

ఎక్క‌డ చూసినా.. జుట్టు విర‌బూసుకుని విన్యాసాలు

ఎక్క‌డ చూసినా.. వీధుల‌న్నీ బూడిద‌మ‌యం..

ఎక్క‌డ చూసినా.. వాడ‌ల‌న్నీ భ‌యాన‌క వాతావ‌ర‌ణం..

మ‌హాకుంభ‌మేళా ముగింపు సంద‌ర్భంగా 8K న్యూస్ స్పెషల్ స్టోరీ

 

హిందూ సనాతన ధర్మంలో మహా కుంభమేళాకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మహా కుంభమేళాను నిర్వహిస్తారు. ఈ కుంభమేళాలో పాల్గొనేందుకు ప్రపంచం నలుమూలల నుంచి కోట్ల‌ సంఖ్యలో భక్తులు తరలివస్తారు. దీని కంటే ముందు ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి కూడా కుంభమేళా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అర్ధ కుంభమేళాను ప్రతి ఆరేళ్లకు ఒకసారి హరిద్వార్ లేదా ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహిస్తారు. పూర్ణ కుంభ మేళా మాత్రం ప్రతి 12 ఏళ్లకు ఒకసారి ప్రయాగ్‌రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్‌లో నిర్వహిస్తారు. ఇంతకు ముందు 2013వ‌ సంవత్సరంలో ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా నిర్వహించారు. మళ్లీ ఇప్పుడు 2025 జనవరి 13 నుంచి 2025 ఫిబ్రవరి 26 వరకు మహా కుంభమేళా నిర్వహించారు.

 

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, సూర్యుడు మకరంలోకి ప్రవేశించినప్పుడు మహా కుంభం ప్రారంభమవుతుంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం, మకర సంక్రాంతి పండుగ నుంచే కుంభస్నానం ప్రారంభమవుతుంది. కుంభమేళా స్నానానికి దాదాపు 850 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. దీన్ని ఆదిశంకరాచార్యులు ప్రారంభించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. పురాణాల ప్రకారం, సాగర మథనం ప్రారంభమైనప్పటి నుంచి కుంభం నిర్వహించినట్లు చెబుతారు. కొందరు పండితులు దీన్ని గుప్తుల కాలం నుంచి ప్రారంభించినట్లు చెబుతారు.

 

హిందూ పురాణాల ప్రకారం దేవతలు, రాక్షసులు కలిసి సాగర మథనం చేశారు. ఈ సమయంలో అనేక రత్నాలు, అప్సరసలు, జంతువులు, అమృతం వంటివి బయటికొచ్చాయి. అయితే అమృతం విషయంలో దేవతలు, రాక్షసుల మధ్య వివాదం తలెత్తింది. ఈ సమయంలో కొన్ని అమృతపు చుక్కలు భూమిపై పడ్డాయి. ఇవి ఎక్కడ పడితే అక్కడ కుంభం నిర్వహించారు. ప్రయాగ్‌, నాసిక్, హరిద్వార్, ఉజ్జయినిలో అమృతపు చుక్కలు పడ్డాయని పురాణాల్లో పేర్కొన్నారు. దేవతలు, రాక్షసుల మధ్య 12 ఏళ్ల పాటు యుద్ధం జరిగింది. అందుకే 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా నిర్వహిస్తారు.

 

అమృతం కోసం జరిగిన పోరాటంలో అమృతాన్ని ప్రవహించకుండా చంద్రుడు కాపాడాడు. గురువు కలశం దాచాడు. సూర్య దేవుడు కలశాన్ని పగిలిపోకుండా కాపాడాడు. శనిదేవుడు ఇంద్రుని కోపం నుంచి రక్షించాడు. అందుకే ఈ గ్రహాలు కలిసిన ప్రతి సమయంలో మహాకుంభం నిర్వహిస్తారు. ఎందుకంటే ఈ గ్రహాల కలయిక వేళ అమృత పాత్ర రక్షించబడింది. ఆ తర్వాత దేవతలందరూ శ్రీ విష్ణుమూర్తి సాయంతో అమృతాన్ని సేవించారు.

 

మహాకుంభమేళా వేళ చేసే స్నానాన్ని రాజస్నానంగా పరిగణిస్తారు. ఈ సమయంలో నదుల నీరు అమృతంతో కూడిన సమానమైన లక్షణాలను కలిగి ఉంటాయ‌ని చాలా మంది నమ్మకం. అంతేకాదు సకల దేవతల అనుగ్రహం లభిస్తుందని కూడా నమ్ముతారు. ముఖ్యంగా ప్రయాగ్‌రాజ్‌లో రాజస్నానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ యమునా, సరస్వతి, గంగా నదులు కూడా కలుస్తాయి. అందుకే కోట్ల‌ సంఖ్యలో భక్తులు మ‌హాకుంభ‌మేళాకు తరలివస్తారు. నేడు అంటే మహాశివరాత్రి రోజున కుంభమేళా చివరి పుణ్య స్నానం ముగుస్తుంది.


Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD